తీహార్ జైల్లో కవితతో భర్త అనిల్ ములాఖత్

తీహార్ జైల్లో కవితతో భర్త అనిల్ ములాఖత్

న్యూఢిల్లీ, వెలుగు: రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా తప్పుడు కేసు బనాయించి తీహార్ జైల్లో ఉంచినంత మాత్రానా.. తానేం ధైర్యం కోల్పోలేదని కవిత అన్నారు. తన మనోధైర్యాన్ని ఎవరూ బ్రేక్ చేయలేరని భర్త అనిల్​తో చెప్పారు. తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న కవితను గురువారం ఫస్ట్ టైమ్ ఆమె భర్త అనిల్ ములాఖత్ అయ్యారు. ఉదయం 8 గంటలకు తీహార్ జైలుకు వెళ్లిన అనిల్.. జైలు నిబంధనల ప్రకారం సాధారణ ఖైదీలను కలిసే టైమ్​లోనే కవితతో భేటీ అయ్యారు.

దాదాపు 15 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. జైలు సిబ్బంది అందిస్తున్న ఫుడ్, మెడిసిన్స్, ఇతర సౌలత్​ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోవద్దని ఆమెకు సూచించారు. ఏప్రిల్ 1వ తేదీన ట్రయల్ కోర్టు ముందుకు రానున్న మధ్యంతర బెయిల్ పిటిషన్​పై చర్చించారు. న్యాయ సలహాలు తీసుకుంటున్నామని కవితకు అనిల్ వివరించారు. తన గురించి భయపడొద్దని, క్లీన్ అండ్ నీట్​గా బయటకు వస్తానని కవిత ధీమా వ్యక్తం చేశారు. చిన్న కొడుకు ఆర్యను ఎగ్జామ్స్​పై ఫోకస్ పెట్టేలా చూడాలని అనిల్​ను కవిత కోరారు. అమ్మ త్వరలోనే బయటకు వస్తుందని, ధైర్యంగా ఉండాల్సిందిగా చెప్పాలని అన్నారు.

రెండో రోజు గురువారం కూడా కవిత జైల్ ఫుడ్​నే తీసుకున్నారు. కాగా, జైలు నిబంధనల ప్రకారం వారానికి రెండు సార్లు ములాఖత్ ఉంటుంది. శుక్రవారం గుడ్ ఫ్రైడే, శని, ఆదివారాలు సెలవు కావడంతో ములాఖత్ ఉండదని జైలు అధికారులు అంటున్నారు. దీంతో వచ్చే వారంలోనే మరోసారి కుటుంబ సభ్యులు కవితను కలిసే అవకాశం ఉంది. కాగా, మంగళసూత్రం, కళ్లజోడు, పుస్తకాలు, మెడిసిన్స్ అనుమతించాలని జైలు అధికారులకు కవిత విజ్ఞప్తి చేశారు. ఇదే విషయాన్ని ట్రయల్ కోర్టు దృష్టికి కవిత తరఫు అడ్వొకేట్ తీసుకెళ్లినట్టు సమాచారం.